మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపి చీఫ్ అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు.
రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు మరియు వేలాది మంది మద్దతుదారులు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు గుమిగూడారు. జాతీయ జెండాతో కప్పబడిన పవార్ మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన కటేవాడి గ్రామం నుండి బారామతికి అంతిమ సంస్కారాల కోసం తీసుకువచ్చారు. ఆయన కుమారులు పార్థ్ పవార్ మరియు జే పవార్ చితికి నిప్పంటించి, గంభీరమైన వాతావరణం మధ్య దహన సంస్కారాలు నిర్వహించారు.
నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.