ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 9.43 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి పని చేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఫైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని వెనక్కి మళ్లించి 10.10 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ప్రయాణీకులను మరో విమానంలో బెంగళూరు తరలించారు.
కాగా.. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. తమ సంస్థ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తమ సిబ్బంది ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పారు. నిపుణులు విమానాన్ని పరిశీలించడం ప్రారంభించారని, ప్రయాణీకులను మరో విమానంలో బెంగళూరుకు తీసుకువెళ్లినట్లు తెలిపారు.