మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య..ప్రమాద అంచులకు వెళ్లొచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ

ఎయిర్ ఇండియా విమానం AI 2455, రాడార్ పనిచేయకపోవడం కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది

By Knakam Karthik
Published on : 11 Aug 2025 11:21 AM IST

National News, Chennai, Air India Flight,  Emergency Landing, Kc Venugopal

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య..ప్రమాద అంచులకు వెళ్లొచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ

సీనియర్ రాజకీయ నాయకులతో తిరువనంతపురం నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 2455, రాడార్ పనిచేయకపోవడం కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానంలో నలుగురు కేరళ ఎంపీలు మరియు ఒక తమిళనాడు ఎంపీ ఉన్నారు. తిరువనంతపురం నుండి బయలుదేరిన విమానం AI 2455 ప్రయాణీకులలో కేరళకు చెందిన నలుగురు ఎంపీలు - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ , యుడిఎఫ్ కన్వీనర్ అదూర్ ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోడికున్నిల్ సురేష్, కె. రాధాకృష్ణన్ - తమిళనాడు ఎంపి రాబర్ట్ బ్రూస్ ఉన్నారు.

చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అవుతుండగా భయానక అనుభవం ఎదురైందని ఆ విమానంలో ప్రయాణించిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాదం అంచుల వరకు వెళ్లి పైలట్ల చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఎయిరిండియా విమానంలో నేను, మరికొంతమంది ఎంపీలు, వందల మంది ప్రయాణికులు ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చాం. తిరువనంతపురంలో విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే కుదుపులు మొదలయ్యాయి. గంట ప్రయాణం తర్వాత విమానాన్ని చెన్నైకి మళ్లిస్తున్నామని కెప్టెన్‌ ప్రకటించారు. చెన్నైలో ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి అనుమతి కోసం వేచి చూస్తూ రెండు గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు ఏటీసీ అనుమతినివ్వడంతో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించారు. చివరి నిమిషంలో అదే రన్ వే పైకి మరో విమానం రావడం చూసి మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యాం. అయితే, పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి తిరిగి టేకాఫ్ చేశారు. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు’’ అని పేర్కొన్నారు.

Next Story