అప్పుడు జుట్టు రాలింది.. ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయి.. ఆందోళనలో ఆ గ్రామాల ప్రజలు..!
ఇవే ప్రాంతాల్లో ప్రజలు గోళ్ల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు తెలియజేశారు.
By Knakam Karthik
అప్పుడు హెయిర్‌ఫాల్, ఇప్పుడు నెయిల్స్ ఫాల్..ఆ గ్రామాల్లో వింత పరిస్థితి
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు నెలల క్రితం ఆకస్మికంగా జుట్టు రాలిపోయిన వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవే ప్రాంతాల్లో ప్రజలు గోళ్ల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు తెలియజేశారు. కనీసం 29 మంది గోర్లు రాలిపోతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో పదుల సంఖ్యలో పౌరులు ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. బుల్దానాలోని షెగావ్ తాలుకాలో అనేక మంది ప్రజలు తమ జుట్టు రాలడం గురించి వెల్లడించిన తర్వాత ఆ ప్రాంతం వార్తల్లో నిలిచింది. తరువాత ఒక అధ్యయనంలో గ్రామస్తులు తినే గోధుమలలోని విషపూరిత అంశాలే ఈ వ్యాధికి కారణమని తేల్చారు.
తాజాగా మహారాష్ట్రలోని షెగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 30 మంది వైద్యులను సంప్రదించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు డాక్టర్ అనిల్ బంకార్ పేర్కొన్నారు. అయితే, దీనికి కూడా సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా మానిక వైద్య అధికారి ప్రశాంత్ మాట్లాడుతూ.. 30 మందికి పైగా గోర్లు దెబ్బతిన్నాయి. పరీక్షల కోసం రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ సమస్యకు కారణం ఇంకా గుర్తించబడనప్పటికీ, జుట్టు రాలడం కారణంగా బాధపడేవారు, గోర్లు రాలిపోవడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇది అధిక సెలీనియం పెరగడం కారణం కావొచ్చు. సెలీనియం అనేది నేల, నీరు మరియు కొన్ని ఆహారాలలో కనిపించే ఒక ఖనిజం. డిసెంబర్ 2024, ఈ సంవత్సరం జనవరి మధ్య, బుల్ధానాలోని 18 గ్రామాల నుండి 279 మంది ప్రజలు అకస్మాత్తుగా జుట్టు రాలడాన్ని నివేదించారు, దీనిని 'అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్' అని కూడా పిలుస్తారు..అని వైద్య అధికారి తెలిపారు.