మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాందేవ్‌బాబా

After furore for slurring women, Ramdev regrets and apologises. మ‌హిళ‌లు దుస్తులు వేసుకోక‌పోయినా కూడా వారు బాగుంటారు అంటూ ఇటీవల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు

By అంజి  Published on  28 Nov 2022 6:54 AM GMT
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాందేవ్‌బాబా

మ‌హిళ‌లు దుస్తులు వేసుకోక‌పోయినా కూడా వారు బాగుంటారు అంటూ ఇటీవల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా. ఆయన చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు రావడంతో రాందేవ్‌ బాబా వెనక్కు తగ్గారు. మహిళలు కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు క్షమించాలని రాందేవ్‌ బాబా కోరారు.

మ‌హిళ‌లు దుస్తులు వేసుకోక‌పోయినా చాలా అందంగా ఉంటారంటూ రాందేవ్‌ బాబా చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయమై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు రాందేవ్ బాబా స్పందించారు. రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. "మా నోటీసుకు అతని సమాధానం మాకు అందింది...అయితే, ఇంకా ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే, మేము పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, గత వారం జరిగిన కార్యక్రమం యొక్క పూర్తి వీడియో రికార్డింగ్ పొందుతాము" అని చకంకర్ తెలిపారు.

మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాందేవ్‌బాబా అన్నారు. కేంద్ర సర్కార్ చేపట్టిన 'బేటీ బచావో-బేటీ పడావో' కార్యక్రమాలను తాను ప్రోత్సహిస్తానన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదని చెప్పారు.

అసలేం జరిగిందంటే?

మ‌హారాష్ట్ర‌లోని థానేలో ప‌తంజ‌లి యోగా పీఠం, ముంబై మ‌హిళ‌ల పతంజ‌లి యోగా స‌మితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాల‌ను శుక్ర‌వారం నిర్వ‌హించాయి, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆయ‌న భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ స‌హా ప‌లువురు మ‌హిళ‌లు దీనికి హాజ‌ర‌య్యారు. యోగా శిబిరం ముగిసిన వెంట‌నే అక్క‌డ ఓ ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. యోగా శిబిరానికి మ‌హిళ‌లు యోగా దుస్తులు ధ‌రించి వ‌చ్చారు. యోగా శిబిరం ముగిసిన వెంట‌నే స‌మావేశం ప్రారంభం కావ‌డంతో మ‌హిళ‌లు త‌మ దుస్తులు మార్చుకుని చీర‌లు వంటివి ధ‌రించేందుకు వారికి స‌మ‌యం దొర‌క‌లేదు. దీనిపై రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. 'మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు' అని అన్నారు.

Next Story