బైకర్ అజాగ్రత్తతో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
అప్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 9:29 AM GMTబైకర్ అజాగ్రత్తతో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
అప్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అప్ఘానిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్ లోని గెరాష్క్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక ట్రాఫిక్ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా వెల్లడించారు. ఒక బైకర్ తప్పిదంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్‌కు వెళ్తున్న బస్సును ఓ బైకర్ వచ్చి ఢీకొట్టాడు. దాంతో.. కంగారుపడిపోయిన బస్సు డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపు కోల్పోయాడు. దాంతో.. బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకెళ్లింది. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. అవే మంటలు బస్సుకు కూడా అంటుకున్నాయి. దాంతో బస్సులో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా తెలిపారు. 21 మంది చనిపోయారనీ.. మరో 38 మంది గాయపడ్డారని చెప్పారు. ఆయన వెంటనే ఇతర అధికారులకు సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు చేశామన్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక చికిత్స పొందుతున్న వారిలో మరో 11 మంది విషమంగా ఉందనీ.. దాంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.