రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఐదుగురు వ్యక్తుల గ్యాంగ్ రూ.25 లక్షలు మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ఈ మోసానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, జునా అఖారాకు చెందిన ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్, ఒక గుర్తుతెలియని వ్యక్తిపై మోసం, నేరపూరిత బెదిరింపు, దోపిడీకి సంబంధించి కేసు నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ డికె శర్మ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని శర్మ తెలిపారు.
బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన జగదీష్ పటానీకి తెలిసిన శివేంద్ర ప్రతాప్ సింగ్ దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్‌లకు తనను పరిచయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితులు తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ కమిషన్‌లో ఛైర్మన్, వైస్-ఛైర్మన్ లేదా అలాంటి ప్రతిష్టాత్మకమైన పదవిని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ బృందం దిశా పటానీ తండ్రి నుండి రూ. 25 లక్షలు తీసుకుంది. రూ. 5 లక్షల నగదు, రూ. 20 లక్షలను మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. మూడు నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిందితులు వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. పటానీ తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, వారు బెదిరింపులకు దిగడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ తనను బెదిరించడం మొదలుపెట్టడంతో మోసం జరిగినట్లు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పటానీ. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.