కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా ఆయన ప్రైవేట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తన ఫిర్యాదుతో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుండడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి నిర్ణయించుకున్నారు. ఆయన తరపు న్యాయవాది బెంగళూరు లోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దినేశ్ సంతకం చేసిన లేఖను అందించారు.
ఈ నెల 2న రమేశ్ జార్కిహోళిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు అందులో తెలిపారు. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని దినేశ్ నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ఆయన సంతకం చేసి ఇచ్చిన లేఖను పోలీసులకు అందించినట్టు న్యాయవాది ఎస్‌కే పాటిల్ తెలిపారు. ఆయన త్వరలోనే పోలీసులను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తారని అన్నారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే దినేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వస్తూ ఉండగా.. ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోరని పాటిల్ చెప్పుకొచ్చారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడడమే ఆయన లక్ష్యమని.. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని, అది మరింత తీవ్రంగా మారకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారాన్ని పోలీసులకు అందించేందుకు దినేశ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.