ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్‌ పిలుపు, ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 10:18 AM IST
AAP,  Prime Minister house, security, Delhi ,

 ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్‌ పిలుపు, ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్‌ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పటేల్‌ చౌక్ ప్రాంతానికి చేరుకుని.. ఆ తర్వాత అక్కడి నుంచి తుగ్లగ్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో మోదీ నివాసానికి బయల్దేరనున్నారు. ప్రధాని నివాసం వద్ద ఎప్పుడు భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక తాజాగా ఆప్‌ పిలుపుతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత పెంచారు పోలీసులు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఇప్పటికే ఆప్‌ ఆందోళనలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కానీ.. ఆప్ నాయకులు మాత్రం ప్రధాని నివాసాన్ని ముట్టడించి తీరతామని చెప్పారు. దాంతో.. పోలీసులు పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటువైపుగా ఎవరూ రాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక వాహనదారులకు కూడా పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. తుగ్లగ్ రోడ్డులో, సఫ్దర్‌గంజ్‌ రోడ్డు, కేమల్‌ అటటుర్‌ మార్గ్‌లో వాహనాలను నిలపడం గానీ, పార్కింగ్‌ చేయడానికి గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఈనెల 22న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా వారం రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆప్‌ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ నాయకులు, కార్యకర్తలు తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చారు. కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్ చిత్రాన్ని డిస్‌ప్లేలో ఉంచారు. ఇక తాజాగా ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ఆప్ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Next Story