బిహార్ ఎన్నికల జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుండి ఆధార్‌ను మినహాయించడంపై కొనసాగుతున్న వివాదం మధ్య, ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ (Aadhaar) ను మినహాయించాలనే అంశంపై వివాదం కొనసాగుతోంది.
ఈ మేరకు ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఫేక్ ఆధార్‌కార్డుల సృష్టిని కట్టడి చేసే మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ సాయంతో నకిలీ ఆధార్ కార్డులను గుర్తించవచ్చని వెల్లడించారు. ‘‘అన్ని కొత్త ఆధార్‌కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఉడాయ్ రూపొందించిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ ద్వారా స్కాన్ చేసి.. వివరాలను సరిపోల్చుకోవచ్చు. ఒకవేళ ఫేక్ ఆధార్ కార్డులు ఎవరైనా తయారుచేస్తే.. ఈ యాప్ ద్వారా వాటిని చెక్ చేసి అడ్డుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు.