ఏడాది పాటు కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన తర్వాత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి నిబంధనలు విధించడంతో ప్రతిపక్షాలు, జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఏర్పాటు చేసిన కో-విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వనీ చౌబే లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కో-విన్ పోర్టల్‌లో ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఈ పోర్టల్‌ను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ సహకారంతో కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిందని తెలిపారు. కో-విన్ యాప్‌లోనూ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ తప్పనిసరికాదన్నారు. ఈ- పోర్టల్‌లో ఫిబ్రవరి 1 వరకు 58.90 లక్షల మంది నమోదు చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది పాటు వణికించిన కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌ల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తప్ప ఎలాంటి ప్రమాదం జరలేదన్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందస్తుగా తమ తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.