పంజాబ్‌లో క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిని కాల్చి చంపిన తోటి విద్యార్థి (Video)

పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక లా కాలేజీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 9 Feb 2026 2:04 PM IST

Punjab, Student Dead, Law College, Crime

పంజాబ్‌లో క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిని కాల్చి చంపిన తోటి విద్యార్థి (Video)

పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక లా కాలేజీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ విద్యార్థి తన సహచర విద్యార్థినిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే..టార్న్ తరణ్ జిల్లా ఉస్మా గ్రామంలోని 'మై భాగో లా కాలేజీ'లో ఈ ఘటన జరిగింది. నౌషెహ్రా పన్నువాన్ గ్రామానికి చెందిన సందీప్ కౌర్, మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్ సింగ్ ఇద్దరూ అదే కాలేజీలో ఎల్‌ఎల్‌బీ (LLB) మొదటి సంవత్సరం చదువుతున్నారు.

సోమవారం మధ్యాహ్నం క్లాస్ జరుగుతున్న సమయంలో, ప్రిన్స్ రాజ్ సింగ్ ఒక్కసారిగా లేచి తన వద్ద దాచుకున్న తుపాకీతో సందీప్ కౌర్‌పై కాల్పులు జరిపాడు. తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. విద్యార్థులంతా షాక్‌లో ఉండగానే, నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ (SSP) సురేంద్ర లాంబా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్స్ రాజ్‌ను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి కాలేజీలోకి తుపాకీని ఎలా తీసుకురాగలిగాడు అనే అంశంపై కాలేజీ యాజమాన్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే కాలేజీలో కాల్పులు జరగడం పంజాబ్‌లో సంచలనంగా మారింది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కాలేజీ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Next Story