రోడ్డు విస్తరణకు అడ్డంగా 'డ్రీమ్ హౌస్'.. ఏం పర్లేదు.. పక్కకి జరుపుకుంటానన్న రైతు

A farmer in Punjab is moving his 2-storey house 500 feet away from its existing place. ఆ రైతు ఎంతో కష్టపడి.. తన పొలంలో కలల ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇల్లు ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా

By అంజి
Published on : 21 Aug 2022 3:16 PM IST

రోడ్డు విస్తరణకు అడ్డంగా డ్రీమ్ హౌస్.. ఏం పర్లేదు.. పక్కకి జరుపుకుంటానన్న రైతు

ఆ రైతు ఎంతో కష్టపడి.. తన పొలంలో కలల ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇల్లు ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా మారింది. దీంతో కూల్చేస్తామని ఆ రైతుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు రోడ్డు విస్తరణ కూల్చేస్తారని తెలియడంతో రైతు ఎంతో బాధపడ్డాడు. తన ఇంటిని కూల్చడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. అధికారులు మాత్రం.. కూల్చినందుకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అందుకు అంగీకరించని ఆ రైతు.. తన ఇంటిని పక్కకి జరుపుకుంటానని చెప్పాడు. ఆ మాట విని అధికారులు నవ్వుకున్నారు. కానీ రైతు మాత్రం తాను చెప్పింది.. చేసి చూపిచ్చాడు. తన రెండతస్తుల భవనాన్ని 500 మీటర్లు పక్కకి జరిపే పనిలో నిమగ్నం అయ్యాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్‌రూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైతు సుఖ్‌విందర్‌ సింగ్‌.. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న కలల సౌధాన్ని కూల్చడం ఇష్టం లేక, అక్కడి నుంచి పక్కకు తరలించే పనిలో పడ్డాడు. రైతు.. తన స్వగ్రామం రోషన్‌ వాలాలో రెండతస్తుల ఇంటిని కట్టుకున్నాడు. అయితే ఆయన ఇంటి మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వేను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. భారత్‌ మాల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ హైవే ఢిల్లీ, అమృత్‌ సర్‌ కత్రా ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ హైవే నిర్మాణం పూర్తి అయితే ఢిల్లీ - కత్రా మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలను కలుపుతూ ఈ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలోనే పంజాబ్‌లో ప్రభుత్వం రోడ్డు కోసం భూసేకరణ చేపట్టింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న రైతు ఇంటిని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నష్టపరిహారం కూడా ఇస్తామని తెలిపింది. అయితే రైతు మాత్రం తన ఇంటిని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాడు. పునాదులతో సహా ఆ ఇంటికి పక్కకి జరపాలని భావించాడు. ఇందు కోసం భవన నిర్మాణ కార్మికులను, ఇంజినీర్లను తీసుకొచ్చాడు. ఆ వెంటనే ఇంటిని అమాంతం జాకీలతో పైకి లేపారు. భవనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చక్రాల్లాంటి కదిలే గేర్లను ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు సుమారు 250 అడుగుల వరకు ఇంటిని తరలించారు. ఈ ఇంటిని నిర్మించేందుకు సుమారు కోటిన్నర రూపాయలను ఖర్చు చేసినట్లు సుఖ్‌ విందర్‌ సింగ్‌ వెల్లడించారు.ఈ ఇంటి నిర్మాణానికి రెండేళ్లకు పైగా సమయం పట్టిందని, ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి కట్టుకున్న కలల ఇంటిని కూల్చేయడం తట్టుకోలేనని రైతు సుఖ్‌ విందర్‌ సింగర్‌ చెప్పాడు. ఇంటిని తరలించే ప్రక్రియ సగం వరకు పూర్తయ్యిందని.. మరికొద్ది రోజుల్లోనే కంప్లీట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

Next Story