ప్రిడేటర్ డ్రోన్ల కోసం.. అమెరికన్ కంపెనీతో భారత్ డీల్ వెనుక మర్మం ఇదేనా.!
భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
By అంజి Published on 29 Jun 2023 1:48 PM ISTప్రిడేటర్ డ్రోన్ల కోసం.. అమెరికన్ కంపెనీతో భారత్ డీల్ వెనుక మర్మం ఇదేనా.!
'ప్రిడేటర్ డీల్ గోల్‌మాల్.. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.150 కోట్ల విలువైన డ్రోన్‌కు 813 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన కేంద్రం' అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు.. భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో భారత్ రక్షణ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే మీడియా మాత్రం ప్రధాని అమెరికా పర్యటనలో ఎవర్ని కలిశారు, ఏం మాట్లాడారు, ఏఏ డిన్నర్‌లలో పాల్గొన్నారు అన్న అంశాలపై ఫోకస్ చేసింది. ప్రధానంగా భారత్ అమెరికా కంపెనీతో కుదుర్చుకున్న డిఫెన్స్ డీల్‌ని ఓ పెద్ద గోల్‌మాల్‌గా కనబడుతోందని ఒకటిరెండు మీడియా సంస్థలు తప్పా.. ఏ ప్రధాని మీడియా సంస్థలు కవర్ చేయలేదు. కాగా భారత్ కుదుర్చుకున్న డీల్‌పై ప్రధాన విపక్ష పార్టీలు అధికార బీజేపీని నిలదీస్తున్నాయి.
దేశ రక్షణ రంగంలో మరింత టెక్నాలజీని చేర్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్‌తో భారత్ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఎంక్యూ9బీ టైప్‌కు చెందిన 31 ప్రిడేటర్ డ్రోన్లను జీఏ భారత్‌కు అందించనుంది. ఇందుకోసం భారత్ రూ.25,200 కోట్ల రూపాయలను జీఏకు చెల్లించనుంది. ఈ లెక్కనా ఒక్కో డ్రోన్ విలువ రూ.813 కోట్లు అన్నమాట. అమెరికాతో ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్‌లో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంగా దీనిని అభివర్ణించారు.
భారత్ కొనుగోలు చేసే ఈ 31 డ్రోన్ విమానాల్లో 15 నేవీకి, 16 ఆర్మీకి అందించనున్నారు. అయితే ఈ ప్రిడేటర్ డ్రోన్ల ఖరీదు విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇదే మోడల్ డ్రోన్ ఖరీదు రూ.150 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే భారత్ నాలుగైదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి ఈ డ్రోన్లను కొనేందుకు సిద్ధమైంది. అయితే దీనిపై ప్రతిపక్షాలను నుండి విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని, ఖరీదు విషయం గురించి మాట్లాడాల్సి ఉందంటూ యూటర్న్ తీసుకుంది. మరోవైపు డీల్ ఒకే అయినట్లు రాయిటర్స్ సహా ప్రధాన పత్రికలు ప్రచురించాయని నమస్తే తెలంగాణ పేర్కొంది.
జీఏ ట్రాక్ రికార్డ్‌ని పరిశీలిస్తే..
జీఏ కంపెనీ గత రికార్డులను పరిశీలిస్తే.. అది ఉత్పత్తి చేసే రక్షణ రంగ ఉత్పత్తులను అందరికీ సమాన ధరలకు అమ్మడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ద్వారా డీల్ కుదుర్చుకున్న వారికి ఓ రకంగా, నేరుగా కాంట్రాక్ట్ ఇచ్చిన వారికి మరో రకంగా, డిమాండ్ ఉన్నప్పుడు ఒక లెక్క, డిమాండ్ లేనప్పుడు మరో లెక్కనా జీఏ ఒప్పందాలు కుదుర్చుకుందని, దాని ట్రాక్ రికార్డ్‌ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు స్పష్టమవుతాయని కథనంలో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం ఎంక్యూ9బీ డ్రోన్ ఒక్కింటికి జీఏ రూ. 450 కోట్లు వసూలు చేయగా.. 2016లో రూ. 102 కోట్లకే ఒక్కో డ్రోన్‌ను అమ్మేందుకు బ్రిటన్‌తో డీల్ మాట్లాడుకుంది. అటు జర్మనీకి కూడా రూ. 139 కోట్లకు అమ్మడానికి రెడీ అయ్యింది ఈ కంపెనీ. ఆస్ట్రేలియాకు మాత్రం రూ.1,066 కోట్ల అధిక ధరను కోట్ చేయగా.. ఆమోదయోగ్యంగా లేదని ఆస్ట్రేలియా ఈ డీల్ నుంచి బయటకొచ్చింది.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రధాన పార్టీలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వీటి మధ్య ప్రధాన పోటీ. ఎన్నో ఏళ్లుగా రక్షణ రంగ ఉత్పత్తులను చేస్తున్న జీఏ కంపెనీకి ఇరు పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం.. జీఏ నుంచి ప్రిడేటర్ డ్రోన్లను కొనాలంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం కూడా భారత్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రయోజనాలను ఆశించి బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తల వంచిందని, అందుకే డీల్‌కు ఒప్పుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తమకు ఇప్పుడు ప్రిడేటర్ డ్రోన్లు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వానిక విజ్ఞప్తి చేసింది. అలాగే అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుపై మరోసారి ఆలోచించాలని గతంలో సూచించింది. అయితే ఇవన్నీ పక్కనపెట్టి.. ఈ డీల్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా ముందుకే వెళ్తున్నదని నమస్తే తెలంగాణ తన కథనంలో రాసింది. డ్రోన్లను సరఫరా చేయడంతో పాటు నిర్ణీత వ్యవధి వరకు వాటి మెయింటెనెన్స్ అందిస్తామని, డ్రోన్లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని (నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్) మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పిందట జీఏ. మరీ భారత్ నిజంగానే అంత ఖర్చు పెట్టి ఆ డ్రోన్ల డీల్ కుదుర్చుకుందా? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.