94 లక్షల పేద కుటుంబాలు.. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 94 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను ఆమోదించింది.
By అంజి Published on 17 Jan 2024 7:32 AM IST94 లక్షల పేద కుటుంబాలు.. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన చర్యగా, బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా గుర్తించబడిన 94 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను ఆమోదించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 94,33,312 కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
బీహార్ స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ కింద, రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇస్తుంది. ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ నిర్ణయించబడింది అని కేబినెట్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్ సిద్ధార్థ్ అన్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తాం, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు నిరుపేద కుటుంబానికి నెలకు రూ.6వేలకు మించి ఆదాయం ఉండకూడదనేది ప్రమాణం. రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తుందని, అందులో మొదటి విడతగా 25 శాతం, రెండో విడత 50 శాతం, మూడో విడతగా 25 శాతం అందజేస్తామన్నారు.
సర్వే ప్రకారం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన బీహార్ కుటుంబాలలో 42 శాతానికి పైగా పేదలు కాగా, జనరల్ కేటగిరీకి చెందిన 25 శాతం మంది పేదలు. షెడ్యూల్డ్ తెగల కుటుంబాలలో 42.70 శాతం పేదలు ఉన్నారు. బీహార్ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 2న కులాల సర్వే ప్రాథమిక ఫలితాలను విడుదల చేయగా, రెండో భాగం డేటా నవంబర్ 7న వెల్లడైంది. సర్వే ప్రకారం.. ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) , అత్యంత వెనుకబడిన తరగతులు (EBCలు) రాష్ట్ర మొత్తం జనాభాలో 60 శాతానికి పైగా ఉండగా , అగ్రవర్ణాల వారు దాదాపు 10 శాతం ఉన్నారు.