మరణించిన తాత.. మృతదేహాన్ని ప్రిజ్‌లో దాచిన మనుమడు
90 Year Old Man's Body Found In Refrigerator.ఓ వృద్దుడు మరణిస్తే.. అతడి మృతదేహాన్ని మనవడు ప్రిజ్‌లో దాచిపెట్టాడు.
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 11:10 AM ISTఓ వృద్దుడు మరణిస్తే.. అతడి మృతదేహాన్ని మనవడు ప్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ ఇంటి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోని ప్రిజ్ తెరిచి చూడగా.. వృద్దుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటన హన్మకొండ జిల్లా పరకాలలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి జిల్లాకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు బైరి బాలయ్య(90) పదేళ్ల కింద కుటుంబ సభ్యులతో పరకాలకు వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
పౌరోహిత్యం చేసే కొడుకు హరికిషన్ 2019లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. కాగా భార్య నర్సమ్మ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. హరికిషన్ భార్య కూడా అంతకుముందే మృతి చెందింది. దీంతో మనవడు నిఖిల్‌తో కలిసి ఉంటున్నాడు. కాగా.. రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండగా చుట్టుపక్కల వారు నిఖిల్‌ను అడుగగా వేర్వేరు కారణాలు చెప్తూ సమాధానం దాట వేస్తున్నాడు. గురువారం ఆ ఇంటి నుంచి దుర్వాసన మరింత ఎక్కువకావడంతో స్థానికులు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటి యజమాని అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ప్రిజ్జ్‌లోంచి దుర్వాసన వస్తుందని గుర్తించాడు.
నిఖిల్‌ను ప్రిజ్ డోర్ తీయాల్సిందిగా కోరగా.. అది తీసే సరికి బాలయ్య మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిఖిల్‌ను విచారించారు. కాగా.. మూడు రోజుల క్రితం మృతి చెందాడని ఏం చేయాలో తెలియక ఫ్రిజ్‌లో దాచిపెట్టానని సమాధానం చెప్పాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకనే ఇలా చేశానన్నాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.