విషాదం..స్కూల్‌లో టిఫిన్స్ బాక్స్ తెరుస్తుండగా విద్యార్థికి హార్ట్‌స్ట్రోక్..ఒక్కసారి కుప్పకూలడంతో
ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతోన్న తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.
By Knakam Karthik
విషాదం..స్కూల్‌లో టిఫిన్స్ బాక్స్ తెరుస్తుండగా విద్యార్థికి హార్ట్‌స్ట్రోక్..ఒక్కసారి కుప్పకూలడంతో
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సికార్‌లోని ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతోన్న తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. బాలిక మొదట తరగతి గదిలో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికను బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతోనే బాలిక మరణించినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ నందకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం..విద్యార్థులందరూ తమ తరగతి గదుల్లో భోజనం చేస్తుండగా, బాలిక తన టిఫిన్ బాక్స్ తెరుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఆమె తన లంచ్ బాక్స్‌ను పడవేసి, తన ఆహారాన్ని నేలపై పడవేసి కుప్పకూలిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని దంతరామ్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి సంరక్షణ కోసం బాలికను సికార్‌లోని SK ఆసుపత్రికి పంపాలని నిర్ణయించారు. అయితే, ఆమెను అంబులెన్స్‌లోకి తరలిస్తుండగా, ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించింది...అని ప్రిన్సిపాల్ చెప్పారు.
అయితే తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉందని, ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక గుండెపోటుతోనే మరణించినట్టు వైద్యులు అనుమానం వ్యక్తంచేశారు. కచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్కూల్ అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.