''నేను తమిళనాడు దివంగత సీఎం జయలలిత సోదరుడిని, జయలలిత ఆస్తిలో సగం వాటా నాదే.'' అంటూ కర్ణాటకు చెందిన ఓ 83 ఏళ్ల వృద్ధుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జయలలిత ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీపతో పాటు తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని కోరాడు. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ ఈ పిటిషన్ దాఖలు చేశాడు.
తాను జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడినని వాసుదేవన్ చెప్పాడు. తాను పుట్టిన తర్వాత నాన్న జయరామ్ వేదమ్మ అనే మహిళను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని, వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ వివరించాడు. 1950లో మైసూరు కోర్టులో జయమ్మ వేసిన భరణం కేసులో తమ నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులు చేర్చామని, ఆ తర్వాత ఆ కేసు కొలిక్కి వచ్చిందని చెప్పాడు. అయితే జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించాడని, కాబట్టి జయలలితకు సోదరుడిగా తాను కూడా వారసుడినేనని, ఆమె ఆస్తిలో 50 శాతం తనకే ఇవ్వాలని పిటిషన్‌లో వాసుదేవన్ పేర్కొన్నాడు. ఇది వరకు నటుడు శోభన్‌బాబు, జయలలిత కుమార్తెగా పేర్కొంటూ.. కర్ణాటకకు చెందిన అమృత అనే మహిళ కూడా పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.