జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ముగ్గురు మరణించారు.
By అంజి
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ముగ్గురు మరణించారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు నిన్న ఉత్తరాఖండ్‌లోని చమోలీ, రుద్రప్రయాగ్, తెహ్రీ, బాగేశ్వర్ జిల్లాల్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌లతో ఐదురుగు చనిపోయారు. 11 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. రాంబన్ శ్రీనగర్‌కు సుమారు 136 కి.మీ దూరంలో ఉంది.
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు ఏర్పడి రోడ్ల రవాణా తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవే (NH-44) పూర్తిగా మూసివేయబడింది. డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. “కొన్ని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. NH-44 రేపటికి తెరవవచ్చు. మఘల్ రోడ్డుపై అడ్డంకులను తొలగించాం. అవసరమైన సరుకుల రవాణాకు అనుమతి ఇచ్చాం” అని తెలిపారు.
వాతావరణ శాఖ పూన్చ్, రీయాసి, రాజౌరి, కిష్తవార్, ఉదంపూర్ జిల్లాలకు పసుపు అలెర్ట్ జారీ చేసింది. రాబోయే శనివారం, ఆదివారాల్లో పూన్చ్, కిష్తవార్, జమ్మూ, రాంబన్, ఉదంపూర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలు, ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఆగస్టు 30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు సాధ్యమైతే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచించారు.
గురువారం, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద పరిస్థితిని సమీక్షించారు. రెండు రోజుల కురిసిన వర్షం కారణంగా యూనియన్ టెరిటరీ పెద్ద విపత్తు నుంచి తప్పించుకుందని తెలిపారు. “ఇంకా ఒకటిన్నర రోజు వర్షం పడితే 2014 వరదల తరహా పరిస్థితి ఎదురయ్యేది. ఇప్పుడు నీరు తగ్గుతోంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలి” అని అబ్దుల్లా హెచ్చరించారు.