76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అంగరంగ వైభవంగా ముస్తాబైన ఎర్రకోట

76th Independence Day celebrations.. Heavy security near Red Fort. 76వ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్వతంత్ర

By అంజి  Published on  14 Aug 2022 6:37 PM IST
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అంగరంగ వైభవంగా ముస్తాబైన ఎర్రకోట

76వ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్య దినోత్సవ వేడుక వైభవంగా జరగనుంది. చారిత్రక ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండా ఎగురవేయనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ ఏడాది ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలోనే హర్‌ ఘర్‌ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ, మేరా భారత్‌ మహాన్‌ అంటూ దేశభక్తిని చాటుకున్నారు. ఇక ఎర్రకోట పరిసరాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రసంగం చేస్తుంటారు. ఈ ప్రసంగంలో మోదీ అనేక కీలక అంశాలపై మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను ప్రస్తావిస్తుంటారు. ఈ సారి కూడా ముఖ్యమైన అంశాలపై ప్రసంగించబోతున్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. చారిత్రక ఎర్రకోట చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులు, భద్రతా దళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్​జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్​ను రంగంలోకి దించారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

Next Story