భారత్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో కరోనాను క్యాష్ చేసుకోవాలని చాలా మంది అనుకుని రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలను భారీగా పెంచారు.. ఇంకొందరేమో బ్లాక్ మార్కెట్ కు కూడా తరలించారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా నకిలీ రెమిడెసివిర్ ఇంజక్షన్ లను అమ్ముతూ వచ్చారు. దీంతో రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో ఫార్మా కంపెనీలు రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలను తగ్గించాయి.
రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలను ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తగ్గించాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) తెలిపింది. దేశంలో కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర ఔషధమైన రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ ఔషధం ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలను ప్రభుత్వం కోరగా.. ఫార్మా కంపెనీలు దిగి వచ్చాయి. కోవిడ్–19 చికిత్సలో సీరియస్ పెషెంట్లకు ఈ యాంటివైరల్ డ్రగ్ ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభుత్వ జోక్యం కారణంగా రెమిడెసివిర్ ఇంజక్షన్ (100 ఎంజీ వయల్) ధరలు దిగివచ్చాయి. ఇంతకు ముందు రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలు 2800-5400 మధ్య ఉండగా.. తగ్గించిన ధరల ప్రకారం 800-3490 రూపాయలకు వచ్చాయి.