ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పరిధిలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. అబుజ్‌మద్ పరిధిలోని నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగింది.
నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల వెంట ఉన్న అడవిలో ఇంద్రావతి ఏరియా కమిటీ, ప్లాటూన్ నంబర్ 16 మావోయిస్టుల ఉనికిపై నిర్దిష్ట నిఘా ఇన్‌పుట్‌ల ఆధారంగా, జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కూడిన ఉమ్మడి బృందం ( STF) మే 21న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు నారాయణపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అడవిలో సెర్చ్ పార్టీపై మావోయిస్టులు దాడి చేయడంతో వారి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో నక్సల్స్ యూనిఫాంలో ఉన్న ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఏడు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.