విషాదం.. ఆలయంలో కూలిన చెట్టు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో జిల్లాలోని బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ గ్రామంలో ఊహించని ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  10 April 2023 1:37 AM GMT
Maharashtra, temple, Akola

విషాదం.. ఆలయంలో కూలిన చెట్టు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో జిల్లాలోని బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ గ్రామంలో ఊహించని ప్రమాదం జరిగింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా స్థానికంగా ఉన్న దేవాలయం యొక్క టిన్ షెడ్‌పై భారీ వేప చెట్టు పడిపోవడంతో ఏడుగురు మరణించారు, కనీసం 30 మంది గాయపడ్డారు. ఆదివారం నాడు సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. అకోలా జిల్లాలో భారీ వర్షం కురవడంతో బాబూజీ మహారాజ్ మందిర్ సంస్థాన్ టిన్ షెడ్‌పై భారీ చాలా ఏళ్ల నాటి వేప చెట్టు పడిపోయింది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన షెడ్డు కింద కూరుకుపోయిన వారిని రక్షించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విరిగిన చెట్టును, కూలిన షెడ్డును లేపేందుకు జేసీబీ యంత్రాలను రప్పించారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారని అరోరా జిల్లా కలెక్టర్ నిమా అరోరా వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ధృవీకరించారు. దాదాపు 30-40 మంది గాయపడి చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో శ్రీరామనవమి నాడు ఆలయంలో బావి కూలిపోయి పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story