50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా.. ఏడుగురు మృతి

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో మహానదిలో 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ శుక్రవారం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

By అంజి  Published on  20 April 2024 6:11 AM GMT
boat capsize, Odisha, Mahanadi river

50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా.. ఏడుగురు మృతి

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో మహానదిలో 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ శుక్రవారం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఓ వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో, శనివారం కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం ఉదయం ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రమాదంలో ఆరుగురి మృతదేహాలు లభించగా, మరోకరి ఆచూకీ గల్లంతైనట్టు సీనియర్ పోలీసు అధికారి చింతామణి ప్రధాన్ ధృవీకరించారు. బోటు బర్‌గఢ్ జిల్లా బంధిపాలి ప్రాంతం నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తోంది. మార్గమధ్యంలో జర్సుగూడలోని శారదా ఘాట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బోటు బోల్తా పడింది. శుక్రవారం ఆలస్యంగా విలేకరులతో జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ మాట్లాడుతూ.. ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) జార్సుగూడ జిల్లా యంత్రాంగం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయంతో తప్పిపోయిన వ్యక్తుల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

"శోధన ఆపరేషన్‌లో చేరడానికి భువనేశ్వర్ నుండి స్కూబా డైవర్లు వస్తారని మాకు సమాచారం అందింది. అప్పటివరకు, మేము 48 మందిని రక్షించాము. వారిని తిరిగి వారి గ్రామాలకు పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని గోయల్ ప్రమాద స్థలంలో విలేకరులతో అన్నారు. "ODRAF నుండి డైవర్లు చాలా బాగా శిక్షణ పొందారు, వారి వద్ద నైట్ లైట్ పరికరాలు ఉన్నాయి. వారు మరో ప్రయత్నం చేస్తారు. వారు వచ్చిన వెంటనే స్కూబా డైవర్ల బృందం చేరుతుంది," అని అన్నారు.

మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మృతుల బంధువులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానిక బిజెపి నాయకుడు సురేష్ పూజారి మాట్లాడుతూ "చెల్లుబాటు లైసెన్స్ లేకుండా బోటు నడుపుతున్నారు" అని ఆరోపించారు. "సంబంధిత అధికారులు దీనికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దానిపై లైఫ్‌గార్డ్ లేడు" అని తెలిపారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, ఘటనపై విచారణ జరుపుతామని జిల్లా అధికారులు తెలిపారు.

Next Story