ఫ‌ర్నీచ‌ర్ షాపులో అగ్నిప్ర‌మాదం.. ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం.. రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

6 Of Family Killed As Fire Breaks Out At Furniture Shop in Firozabad.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 3:05 AM GMT
ఫ‌ర్నీచ‌ర్ షాపులో అగ్నిప్ర‌మాదం.. ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం.. రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మృతుల్లో న‌లుగురు చిన్నారులు ఉన్నారు.

ఫిరోజాబాద్ జిల్లా జస్రానా ప్రాంతంలోని పాదం పట్టణంలోని ఓ భ‌వ‌నంలో ఎల‌క్ట్రానిక్స్ క‌మ్ ఫ‌ర్నీచ‌ర్ దుకాణం ఉంది. భ‌వ‌నం కింది ఫ్లోర్‌లో షాపు ఉండ‌గా మొద‌టి అంత‌స్తులో య‌జ‌మాని కుటుంబం నివ‌సిస్తోంది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత దుకాణంలో మంట‌లు చెల‌రేగాయి. షాపులో ఎల‌క్ట్రానిక్స్, ఫ‌ర్నీచ‌ర్ వ‌స్తువులే ఉండ‌డంతో మంట‌లు భారీగా ఎగిసిప‌డ్డాయి. మొద‌టి అంత‌స్తుకు మంట‌లు వ్యాపించాయి.

స్థానికులు మంట‌ల‌ను గ‌మ‌నించి అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. 18 ఫైరింజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు స‌జీవ ద‌హ‌నం కాగా.. మ‌రో ముగ్గురు తీవ్ర‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్ర‌మాదంలో చనిపోయిన ఆరుగురిలో న‌లుగురు చిన్నారులు ఉన్నార‌ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ తివారీ తెలిపారు. ఆగ్రా, మెయిన్‌పురి, ఇటా, ఫిరోజాబాద్‌ల నుండి 18 అగ్నిమాపక దళ వాహనాలు, 12 పోలీసు స్టేషన్‌ల నుండి సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.

షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ముఖ్య‌మంత్రి యోగి సంతాపం..

ఈ ప్ర‌మాదం పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.

Next Story