దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ప్రతీరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టడికి చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే.. కరోనా వ్యాప్తి దేశంలోని జైళ్లలోకి వ్యాపించింది. తాజాగా హర్యానాలోని కర్నాల్ జైళ్లో 56 మంది ఖైదీలకు కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. దీంతో వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నామన్నారు అధికారులు. అలాగే, ఒడిశాలోని మయూర్‌భంజ్ ఉడల సబ్-జైళ్లో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరికి కూడా ప్రత్యేకంగా చికిత్సకై చర్యలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,64,594 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,62,720 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4,136 మంది కరోనా కారణంగా మరణించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.