మధ్యాహ్నం భోజనం తిన్న 55 మంది విద్యార్థులకు అస్వస్థత

55 children fall sick after consuming midday meals in karnataka. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి 55 మంది విద్యార్థులు

By అంజి  Published on  18 Aug 2022 3:48 PM IST
మధ్యాహ్నం భోజనం తిన్న 55 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మస్కీ తాలుకాలోని అమింగడ్‌ గ్రామంలోని పాఠశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాయచూర్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌.. పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడంతో పాటు నలుగురు వంట సిబ్బందిని తొలగించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న చిన్నారులను డీడీపీఐ వృషబేంద్రయ్య, డీహెచ్‌ఓ డాక్టర్ సురేంద్ర కలిశారు. బుధవారం సగం ఉడికిన ఉప్మా పెట్టారని పిల్లలు తెలిపారు. ఆహారం తీసుకున్న తరువాత విద్యార్థుల్లో చాలా మందికి వాంతులు ప్రారంభమయ్యాయి, కడుపు నొప్పి వస్తోందని కూడా ఇతర విద్యార్థులు తెలిపారు. వెంటనే పాఠశాల అధికారులు వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో అపరిశుభ్రతపై తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

సగం ఉడికిన ఉప్మాను చూసి కొందరు పిల్లలు తినకుండా భోజనానికి ఇంటికి వెళ్లి ఆరోగ్యంగా ఉన్నారు. ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కింది స్థాయి సిబ్బంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా విద్యార్థుల ఆరోగ్యంతో ఆటాలాడుకుంటున్నారు. ఉడికి ఉడకని ఆహారం పెట్టి విద్యార్థుల అస్వస్థతకు కారణం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. విద్యార్థులకు ఇలా కల్తీ ఆహారం, ఉడికి ఉడకని ఆహారం పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story