ఐదంచెల అన్‌లాక్ ప్లాన్‌

5 Level unlock plan.మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో ప్ర‌భుత్వం కొన్ని ఆంక్ష‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2021 9:14 AM GMT
ఐదంచెల అన్‌లాక్ ప్లాన్‌

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో ప్ర‌భుత్వం కొన్ని ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. దీంతో గ‌త కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో మ‌గ్గిన మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సోమ‌వారం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియ‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్షించ‌నుంది.

అన్‌లాక్ లెవ‌ల్ 1 : ఐదు శాతం క‌న్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉండి, 25 శాతం కంటే త‌క్కువ ప‌డ‌కలు ఆస్ప‌త్రుల్లో నిండి ఉన్న ప్రాంతాలు లెవ‌ల్ 1 కింద‌కు వ‌స్తాయి. ఇక్క‌డ పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు విక్రయించే దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతినిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. వివాహాలు, అంత్యక్రియల‌కు అనుమ‌తులుంటాయి. లోక‌ల్ రైళ్లు కూడా నడుస్తాయి.

అన్‌లాక్ లెవ‌ల్ 2 : పాజిటివిటీ రేటు ఐదు శాతం, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 25 ​​నుంచి 40 శాతం మధ్య ఉన్న ప‌రిస్థితుల‌ను రెండవ‌ స్థాయిగా గుర్తిస్తారు. ఇక్క‌డ కూడా మొద‌టి స్థాయిలో మాదిరిగానే అనుమ‌తులు ఉంటాయి. అయితే థియేటర్లు, జిమ్‌లు, వివాహాలు, రెస్టారెంట్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతిస్తారు. లోక‌ల్ రైళ్ల సర్వీసుల‌ను పరిమితంగానే న‌డుపుతారు.

మూడ‌వ స్థాయి: పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 40 నుంచి 60 శాతం మధ్య ఉన్న ప‌రిస్థితుల‌ను మూడ‌వ‌ స్థాయిగా గుర్తిస్తారు. ఈ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తారు. మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. రెస్టారెంట్‌ల‌ను 50 శాతం సామర్థ్యంతో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నిర్వహించవచ్చు. వివాహ వేడుకల‌కు 50 మంది మాత్రమే హాజర‌య్యేందుకు అనుమ‌తినిస్తారు. అంత్యక్రియలకు 20 మంది మాత్ర‌మే హాజరు కావాల్సి ఉంటుంది. సెక్ష‌న్ 144 అమ‌ల్లో ఉంటుంది.

నాల్గవ‌ స్థాయి: పాజిటివిటీ రేటు 10 నుంచి 20 శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 60 నుంచి 75 శాతం మధ్య ఉన్న ప‌రిస్థితుల‌ను నాలుగ‌వ‌ స్థాయిగా గుర్తిస్తారు. నిత్యావ‌స‌ర దుకాణాలు మాత్రమే సాయంత్రం 4 గంటల వరకు తెరవడానికి అనుమతినిస్తారు. రెస్టారెంట్‌ల‌లో పికప్ లేదా హోం డెలివరీకి అనుమ‌తినిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం సిబ్బంది సామర్థ్యంతో న‌డుస్తాయి. వివాహ వేడుకకు 25 మంది మాత్రమే హాజరుకావ‌చ్చు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఐద‌వ స్థాయి : పాజిటివిటీ రేటు 10 నుంచి 20 శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 75శాతానికి పైగా ఉన్న అన్ని ప్రాంతాలు లెవ‌ల్‌-5లో వ‌స్తాయి. ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది.

Next Story