పశ్చిమ బెంగాల్‌లోని రఘునాథ్‌పూర్‌లో 5 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVM) భారతీయ జనతా పార్టీ (BJP) ట్యాగ్‌లతో కనిపించాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. వాటిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ECI)ని కోరింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఓట్ల రిగ్గింగ్ కు బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ పదేపదే హెచ్చరించారు. ఈరోజు.. బంకురాలోని రఘునాథ్‌పూర్‌లో, 5 ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్‌లు కనిపించాయి.. ఎన్నికల కమీషన్ వెంటనే దాన్ని పరిశీలించి, దిద్దుబాటు చర్య తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది తృణమూల్ కాంగ్రెస్.
పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల 6వ దశలో భాగంగా 8 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ లలో ఓటింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్ల మధ్య ఆరు రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) విస్తరించి ఉన్న 58 పార్లమెంటరీ నియోజకవర్గాలలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది, ముగింపు సమయానికి లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఉంది.