జమ్ముకాశ్మీర్‌లోని కిష్టవర్ ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కిష్టావర్ ప్రాంతంలోని హంజార్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. దీంతో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఐదుగురు మృతి చెందగా.. 40 పైగా గల్లంతయ్యారు. కిష్టవర్, హంజార్ గ్రామంతో బాటు 'దాచన్' తహశీల్ లోని పలు గ్రామాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జమ్మూ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నిరాశయులైన వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలు గ్రామాలకు జమ్మూతో రోడ్డు సంబంధాలు తెగిపోయాయని కిష్టవర్ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ శర్మ తెలిపారు. ఆర్మీ, పోలీసు బృందాలు శిథిలాలను తొలగించి బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ఈ బృందాలు వెలికి తీశాయన్నారు.
ఇక రానున్న రోజుల్లో హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.