ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. విమానంలో దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.
ప్రతిస్పందనగా.. పోలీసులు, సైనిక సిబ్బంది, విపత్తు నిర్వహణ QRT, టీం 108 అంబులెన్స్, భట్వారీ BDO, రెవెన్యూ బృందంతో పాటు సంఘటనా స్థలానికి పంపబడ్డాయి. ఉత్తరకాశి జిల్లాలోని గంగానాని సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిన వార్తను గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. "హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశంలో అధికారులు, సహాయ బృందాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.