డెంగ్యూతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి
44 Year old BJP MLA Asha Patel dies of dengue.గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా పటేల్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 12 Dec 2021 7:29 PM ISTగుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా పటేల్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 44 ఏళ్లు. మెహ్సానా జిల్లాలోని ఉంఝా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మరణవార్తను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు.
"ఉంఝా ఎమ్మెల్యే ఆశా పటేల్ ఇప్పుడు మాతో లేరని నేను తీవ్ర విచారంతో మీకు తెలియజేస్తున్నాను. ఆమె డెంగ్యూ చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చేరింది. అయితే.. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికి ఆమెను రక్షించలేకపోయారు'' అని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ విలేకరులతో చెప్పారు. ఆమె పార్థివ దేహాన్ని ఊంఝాకు తరలించి మార్కెట్ యార్డులో ప్రజల సందర్శనార్థం ఉంచుతామన్నారు. సోమవారం సిద్ధ్‌పూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వెంటనే పటేల్ డెంగ్యూతో బాధపడుతున్నారని, ఆదివారం అనారోగ్యంతో పోరాడి ఓడిపోయారని గుజరాత్ బిజెపి ఒక ప్రకటనలో తెలిపింది. ఆశా పటేల్ అకాల మరణం పట్ల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సంతాపం తెలిపారు.
મધ્યાહને સુરજ આથમયો .....નાની ઉમરે લડાયક અને જાગૃત જન પ્રતિનિધિ તરીકે હરહંમેશ પ્રજાની પડખે રહેનાર ડૉ. આશાબેન પટેલના અવસાનથી ઊંડા શોકની લાગણી અને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું. pic.twitter.com/migBKa2BiV
— Vijay Rupani (@vijayrupanibjp) December 12, 2021
పాటిదార్ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఆమె ఒకరు. హార్దిక్ పటేల్‌కు సన్నిహితురాలు కూడా. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు. అయితే.. 2019లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.