40కి పెరిగిన మరణాలు.. ఇంకా 100 మందికి పైగా ఆసుపత్రిలోనే.!
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలోని కరుణాపురం ప్రాంతంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
By Medi Samrat Published on 20 Jun 2024 9:00 PM ISTతమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలోని కరుణాపురం ప్రాంతంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం నాటికి కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కల్తీసారా కారణంగా వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది చికిత్స పొందుతున్నారు. ఎవరికి ఎప్పుడు.. ఏమవుతుందా అని కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్నారు.
ప్రతిపక్షం డీఎంకేపై విరుచుకుపడగా.. తమ పాలనలో మాత్రమే ఇటువంటి ఘటనలు జరిగాయని భావించవద్దని అధికార పార్టీ చెబుతోంది. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిథనాల్ మిక్స్ చేసిన సారా తాగడం వల్లే ఈ మరణాలు సంభవించాయని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని సీఎం స్టాలిన్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశమైన స్టాలిన్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. గోకుల్‌దాస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కల్తీ సారా అమ్మకాలతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించామని స్టాలిన్ తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల సాయం ప్రకటించారు.