పెరుగుతున్న నిపా వైరస్ కేసులు.. కేరళలో కొవిడ్ తరహా పరిస్థితి
కేరళలో నిపా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం వరకు వైరస్ సోకిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.
By Medi Samrat Published on 15 Sept 2023 3:49 PM ISTకేరళలో నిపా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం వరకు వైరస్ సోకిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలో 39 ఏళ్ల వ్యక్తికి ఇన్ఫెక్షన్ నిర్ధారించబడింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసుల గురించి ఆరోగ్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేశారు. శాంపిల్ రిపోర్టు పాజిటివ్‌గా రావడంతో 39 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో కనిపించే వైరస్ జాతి బంగ్లాదేశ్ ది గా గుర్తించినట్లు తెలిపారు. ఈ రకం వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలలో తేలిందని పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరగడం గమనార్హం. వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా ప్రత్యేక నిఘాలో ఉంచారు. నివేదిక ప్రకారం.. సుమారు 706 మంది వైరస్ సోకిన వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. వారిలో పలువురు ప్రమాద స్థితిలో ఉండగా.. హైరిస్క్ కేటగిరీలో ప్రస్తుతం ఎవరికీ లక్షణాలు కనిపించడం లేదని.. అయినా వారిని సీరియస్‌గా పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు.
కేరళలో నిపా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం గురువారం ఉదయం కోజికోడ్ చేరుకుని రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపింది. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ.. కోజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒక మొబైల్ టెస్టింగ్ లాబొరేటరీని ఏర్పాటు చేసి, అనుమానిత సోకిన వ్యక్తుల నమూనాలను పరీక్షించింది. అంటువ్యాధుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ వైరస్ అత్యంత ప్రాణాంతకం కావచ్చని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.