డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గోశాలకు అంటుకుని 38 మూగజీవాలు(ఆవులు) మరణించాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనవాని గ్రామంలోని శ్రీకృష్ణ గోశాల ఉంది. ఈ గోశాలకు పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. అయితే.. సోమవారం మధ్యాహ్నాం 1.30 గంటల ప్రాంతంలో డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి.
ఇవి గోశాలకు వ్యాపించాయి. ఈ మంటల్లో 38 గోవులు కాలిబూడిదయ్యాయి. దీనిపై శ్రీకృష్ణ గోశాల నిర్వాహకుడు సూరజ్ పండిట్ మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో పక్కన ఉన్న డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయని చెప్పాడు. క్షణాల్లోనే మంటలు గోశాలకు వ్యాపించాయని ఆ సమయంలో గోశాలలో 150 గోవులు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే 38 గోవులు మృతి చెందాయని చెప్పాడు.
సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డు సమీపంలో డంపింగ్ యార్డు వదలడం వల్ల ఆవులకు హాని కలిగే ప్రమాదం ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు గతంలో లేఖలు రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు.