35 వాట్సాప్ గ్రూప్‌లపై కేంద్రం నిషేధం.. ఎందుకంటే..?
35 WhatsApp groups banned by the govt for 'spreading fake news' about Agnipath. ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2022 5:28 AM GMTఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా ఓ వైపు చర్చ నడుస్తుండగానే మరో వైపు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
వాట్సాప్ వేదికగా కొందరు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో 35 వాట్సాప్ గ్రూప్‌లను నిషేదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాడుల నుంచి మొదలు కొని బీహార్‌లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టేందుకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికల మధ్య హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉంటే.. నిరసనకారులు నేడు(సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.