అస్సాంలో భారీ వరదలు.. 31 వేల మందికి ఎఫెక్ట్.. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
భారీ వరదల కారణంగా.. అస్సాంలో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా అస్సాంలో 31,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
By అంజి Published on 20 Jun 2023 10:35 AM IST
అస్సాంలో భారీ వరదలు.. 31 వేల మందికి ఎఫెక్ట్.. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
భారీ వరదల కారణంగా.. అస్సాంలో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా అస్సాంలో 31,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాం రాష్ట్రానికి తాజాగా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అస్సాంలో మంగళవారం వరద పరిస్థితి తీవ్రంగా ఉందని, రాష్ట్రంలోని 10 జిల్లాల్లో దాదాపు 31,000 మంది ప్రజలు ఇంకా వరదలో కొట్టుమిట్టాడుతున్నారని అధికారి తెలిపారు.
భారత వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో అస్సాంలోని పలు జిల్లాల్లో 'చాలా భారీ' నుండి 'అత్యంత భారీ' వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 'స్పెషల్ వెదర్ బులెటిన్'లో.. గౌహతిలోని ఐఎండీ యొక్క ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) సోమవారం నుండి 24 గంటల పాటు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులు 'ఆరెంజ్ అలర్ట్'లు, గురువారం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
'రెడ్ అలర్ట్' అంటే తక్షణ చర్య తీసుకోవడాన్ని సూచిస్తుంది. అయితే 'ఆరెంజ్ అలర్ట్' చర్య కోసం సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. 'ఎల్లో అలర్ట్' అంటే వాచ్, అప్‌డేట్‌ని సూచిస్తుంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద రిపోర్టు ప్రకారం.. చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూఘర్, కోక్రాఝర్, లఖింపూర్, నల్బరీ, సోనిత్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో వరదల కారణంగా 30,700 మందికి పైగా ప్రజలు దెబ్బతిన్నారు.
లఖింపూర్ జిల్లాలో 22,000 మందికి పైగా ప్రభావితమయ్యారు, 3,800 మందికి పైగా దిబ్రూఘర్, దాదాపు 1,800 మంది కోక్రాఝర్‌లో ప్రభావితమయ్యారు. ప్రభుత్వం ఏడు జిల్లాల్లో 25 సహాయ పంపిణీ కేంద్రాలను నడుపుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ సహాయ శిబిరం కూడా పనిచేయడం లేదు. ప్రస్తుతం, 444 గ్రామాలు నీటిలో ఉన్నాయి. అస్సాం అంతటా 4,741.23 హెక్టార్ల పంట ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఏఎస్‌డీఏంఏ తెలిపింది.
బిస్వనాథ్, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, కమ్రూప్, కరీంనగర్, కోక్రాజార్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరీ, శివసాగర్, సోనిత్‌పూర్, సౌత్ సల్మారా, తముల్‌పూర్, ఉదల్‌గురిలో వరదల వల్ల భారీ కోతలు సంభవించాయని ఏఎస్‌డీఏంఏ తెలిపింది. దిమా హసావో, కమ్రూప్ మెట్రోపాలిటన్ మరియు కరీంగంజ్‌లోని ప్రదేశాలలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
సోనిత్‌పూర్, నాగోన్, నల్బరీ, బక్సా, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, గోల్‌పరా, గోలాఘాట్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, దిబ్రూఘర్, కరీంగంజ్, ఉదల్‌గురిలలో వరద నీటితో కట్టలు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కచార్, దర్రాంగ్, జోర్హాట్, కమ్రూప్ మెట్రోపాలిటన్, కోక్రాఝర్ మరియు నల్బరీ జిల్లాల్లోని అనేక ప్రాంతాలను పట్టణ వరదలు ముంచెత్తాయి.
కంపూర్ వద్ద బ్రహ్మపుత్ర ఉపనది కోపిలి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది.