భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు.. 30 మంది గల్లంతు ..!
300 people trapped in broken landslides in Maharashtra.భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతుంది. వర్షాల కారణంగా
By తోట వంశీ కుమార్ Published on 23 July 2021 9:01 AM ISTభారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతుంది. వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీ నష్టం వాటిల్లుతోంది. ముంబై మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గురువారం రాత్రి రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 30 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించామని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా నీటమునగడంతో ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరినట్లు రాయ్‌గఢ్ ఇన్‌చార్జి మంత్రి అతిథి తట్కారే తెలిపారు.
Maharashtra government has sought help from the central government. Army's help was sought for the people trapped in Mahad. NDRF team is having trouble reaching the affected villages as roads are submerged underwater: Raigad Guardian Minister Aditi Tatkare
— ANI (@ANI) July 22, 2021
వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లన్నీ నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఎత్తైన భవనాలను ఎక్కి ప్రాణాలను రక్షించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో కొండ చరియాలు విరిగిపడటంతో చీకటి కారణంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఇతర సహాయక బృందాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించడంతో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబైతోపాటు థానే మున్సిపల్ కార్పొరేషన్‌లు అలర్ట్ జారీ చేశాయి. నాసిక్‌లో కొండచరియలు విరిగిపడడంతో రైల్వేట్రాక్‌లు ధ్వంసమయ్యాయి.
ముఖ్యంగా థానే, పాల్ఘర్ జిల్లాలతోపాటు కొంకణ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని సవరించారు. కొంకణ్ రైల్వే రూట్‌లో దాదాపు 6 వేల మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత రాత్రి నుంచి వశిష్ట నది, దామ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.