షాకింగ్‌.. ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థుల‌కు కొవిడ్ టీకా.. అందులో అత‌డి త‌ప్పు లేద‌ట‌

30 School children vaccinated with just one syringe in Madhya Pradesh.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2022 7:00 AM GMT
షాకింగ్‌.. ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థుల‌కు కొవిడ్ టీకా.. అందులో అత‌డి త‌ప్పు లేద‌ట‌

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు టీకా పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అయితే.. కొన్ని చోట్ల అప్పుడ‌ప్పుడు టీకా పంపిణీలో కొన్ని పొరబాట్లు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఒక టీకా బ‌దులు మ‌రొక టీకా ఇవ్వ‌డం, ఒకే వ్య‌క్తికి అధిక డోసులు ఇవ్వడం వంటి కొన్ని ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ వ్యాక్సినేట‌ర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థుల‌కు టీకా వేశాడు. ఇదేమ‌ని అడిగితే పై అధికారులు త‌న‌కు ఒక‌టే సిరంజీని పంపారు అని ఇందులో త‌న త‌ప్పేమీ లేద‌ని అత‌డు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. సాగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇటీవల కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. 12-14 ఏళ్ల విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. దాదాపు 30 మంది విద్యార్థులకు వ్యాక్సిన్లు వేయగా.. అందరికీ ఒకే సిరంజీ ఉపయోగించారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందారు. ఈ విషయమై ఆ స్కూల్లో వ్యాక్సిన్లు వేసిన ఏఎన్ఎం జితేందర్ రాయ్‌ని ప్రశ్నించారు.

వ్యాక్సిన్ మెటీరియ‌ల్ తీసుకువ‌చ్చిన వ్య‌క్తి ఒకే సిరంజీ తీసుకువ‌చ్చాడు. ఒక సూదిని ఒక‌సారే ఉప‌యోగించాల‌ని త‌న‌కు తెలుసున‌ని ఈ విష‌యాన్ని పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు చెప్పాడు. అయితే.. అంద‌రికి ఒకే సిరంజీతో టీకాలు వేయ‌మ‌ని పై అధికారులు చెప్పార‌ని, ఇందులో త‌న త‌ప్పులేద‌ని, వాళ్లు చెప్పిన‌ట్లే చేశాన‌ని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా ఈ ఘ‌ట‌న పై తీవ్ర దుమారం రేగింది. సాగర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీకే గోస్వామి దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Next Story