జ్ఞానవాపి మసీదులో తెలుగు శాసనాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని జ్ఞానవాపి మసీదులో సంస్కృత, ద్రవిడ భాషల్లో శాసనాలు ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది.

By అంజి  Published on  30 Jan 2024 6:45 AM GMT
Telugu inscriptions, Gyanvapi mosque, mandir, varanasi

జ్ఞానవాపి మసీదులో తెలుగు శాసనాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కాశీ విశ్వనాథునిఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సంస్కృత, ద్రవిడ భాషల్లో శాసనాలు ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. వీటితో పాటు తెలుగు లిపితో ఉన్న ఒక శిలా శాసనాన్ని కూడా భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఆ నివేదికను ఏఎస్‌ఐ విడుదల చేసింది. దాని ప్రకారం.. 12, 17 శతాబ్దాలకు చెందిన 34 సంస్కృత, ద్రవిడ భాషల శాసనాలు లభ్యమయ్యాయి. ఒక దానిలో మల్లన్నభట్లు, నారాయణ భట్లు అనే పేర్లు తెలుగులో రాసి ఉన్నాయి. తమకు లభించిన ఆధారాలను బట్టి అక్కడ కచ్చితంగా హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్‌ఐ తేల్చింది.

ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను కనుగొంది. ఏఎస్‌ఐ డైరెక్టర్ (ఎపిగ్రఫీ) కె.మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న 3 శాసనాలతో సహా 34 శాసనాలను విడదీసి, కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై రిపోర్ట్‌ సమర్పించారు. 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్టు కుమారుడు మల్లన భట్టు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా ఉన్నాయని మునిరత్నం తెలిపారు. 1585లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని తెలుగు బ్రహ్మణుడు నారాయణ భట్టు పర్యవేక్షించారు. శిలాశాసనంపై మల్లన్న భట్టు, నారాయణ భట్టు పేర్లు ఉన్నాయి. నారాయణ భట్టు కొడుకే మల్లన్న భట్టు. వీరు తెలుగు బ్రాహ్మణులు.

వీరు 1585లో కాశీవిశ్వనాథుని ఆలయ పునః నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 15వ శతాబ్దంలో జౌన్‌పూర్‌ సుల్తాన్‌ హుస్సేన్‌ షార్కి కాశీవిశ్వనాథుని మందిరాన్ని కూల్చేశారు. తర్వాత కాలంలో రాజ్యం చేపట్టిన రాజా తోడరమల్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశానికి చెందిన నిపుణులైన నారాయణ భట్టును సంప్రదించి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని చరిత్రకారులు చెబుతుంటారు. నారాయణ భట్టు పర్యవేక్షణలోనే కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మితమైంది. అలాగే మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనంలో 'గోవి' (గొర్రెల కాపరి) అని ఉంది. మూడవది, మసీదు ఉత్తర ద్వారం వద్ద 15వ శతాబ్దానికి చెందినది, 14 పూర్తిగా అరిగిపోయిన పంక్తులు ఉన్నాయి. తెలుగుతో పాటు కన్నడ, దేవనాగరి, తమిళ భాషల్లో శాసనాలు ఉండేవి.

Next Story