హర్యానాలోని కర్నాల్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. శివశక్తి అనే పేరు గల ఓ రైస్ మిల్లు సోమవారం-మంగళవారం మధ్య రాత్రి కుప్పకూలింది. కర్నాల్‌లోని తారావోరిలోని మూడు అంతస్తుల మిల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. మిల్లులో పనిచేస్తున్న పలువురు కూలీలు ఇక్కడే నిద్రించేవారని, భవనం కూలిపోవడంతో చాలా మంది కూలీలు శిథిలాల కింద కూరుకుపోయే అవకాశం ఉందని సమాచారం. మిల్లు వద్ద నిద్రిస్తున్న కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. శిథిలాల లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాల్ ఎస్పీ శశాంక్ సావన్ కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసులు మిల్లు యజమానిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మిల్లు భవనంలో 100 మందికి పైగా కూలీలు నిద్రించేవారని చెబుతున్నారు.