జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత సైన్యం లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు.
రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని గురువారం వేకువజామున ఉగ్రవాదులు లోనికి చొరబడేందుకు యత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతం కాగా.. ఐదుగురు సైనికులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు సైనికులు మరణించారు. బేస్‌క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఇంకెవరైనా ఉన్నారనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడితో జమ్మూ కశ్మీరులో హైఅలర్ట్ ప్రకటించారు. రోడ్లపై వాహనాల తనిఖీలు చేస్తున్నారు.