తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

3 Killed In Bomb Blast At Trinamool Leader's House In Bengal.ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పేలుడు ఘ‌ట‌న క‌ల‌కలం సృష్టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2022 7:16 AM GMT
తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పేలుడు ఘ‌ట‌న క‌ల‌కలం సృష్టించింది. తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత ఇంట్లో శుక్ర‌వారం రాత్రి పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పాల్గొన‌నున్న మీటింగ్ వేదిక‌కు స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

తూర్పు మేదినీపూర్‌ జిల్లాలోని భూప‌తిన‌గ‌ర్ ప్రాంతంలో స్థానిక టీఎంసీ నేత ఇంట్లో శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో పెద్ద శ‌బ్ధంతో పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి ఇంటి పై క‌ప్పు పూర్తిగా కూలిపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌గా, మ‌రికొంత మందికి తీవ్ర గాయాలు అయిన‌ట్లు పోలీసులు చెప్పారు. పేలుడుకు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేద‌ని, ఇంట్లోకి బాంబులు ఎలా వ‌చ్చాయి అన్నదానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ శనివారం తూర్పు మేధినిపూర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న పాల్గొనే బ‌హిరంగ స‌భ‌కు కేవ‌లం 2 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. టీఎంసీ నేత‌ల ఇంట్లో నాటు బాంబులు త‌యారు చేస్తున్నార‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ(బీజేపీ) ఆరోపించింది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ సమయంలో అలజడి సృష్టించేందుకే ఈ బాంబులు తయారు చేస్తున్నారంటూ మండిప‌డింది. ఎన్ఐఏ నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

Next Story