కరోనా మహమ్మారి ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపింది. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మొదటి వేవ్ ను తట్టుకుని నిలబడ్డప్పటికీ.. సెకండ్ వేవ్ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెబుతున్నారు. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పెట్టుబడులు, వినియోగం విషయంలో తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాజీవ్ కుమార్ అన్నారు. అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని.. రెండో దశ కరోనా సేవారంగం వంటి వాటిపై నేరుగా ప్రభావం చూపడంతో పాటు.. మొత్తం ఆర్థిక వ్యవస్ధలో అనిశ్చితిని పెంచుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. మునుపటితో పోలిస్తే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుందని రాజీవ్ కుమార్ అంచనా వేశారు.
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. కేవలం 12 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. ఏప్రిల్ 6న 8 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 12 రోజుల్లోనే ఇది రెట్టింపు అయింది. పాజిటివిటీ రేటు గత నెలలో 3.05 శాతంగా ఉండగా.. ఇప్పుడది 13.54 శాతానికి చేరుకుంది.
చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 30.38 శాతం నమోదు కాగా, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్థాన్‌లో 23.33, మధ్యప్రదేశ్‌లో 18.99 శాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇది 30 శాతంగా ఉంది.