ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో జరిగింది.
ఫతేపూర్‌లోని చంద్రికాదేవి ఆలయంలో చిన్నారికి నిర్వహించిన పుట్టెంట్రుకల కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు ట్రాక్టర్‌లో ఘటంపూర్‌లోని ఇళ్లకు వెలుతున్నారు. భదానా గ్రామం సమీపానికి వచ్చే సరికి ట్రాక్టర్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.