229 మంది విద్యార్థులకు కరోనా..
229 School hostel students test coronavirus positive in Maharashtra.మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2021 12:33 PM ISTమహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 8వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 80 మందికిపైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదైన కేసుల్లో సగ భాగం మహారాష్ట్రలోనే నమోదు అవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికి ప్రజలు పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. కేసులు ఇలాగే పెరిగే మరోమారు లాక్‌డౌన్‌ను విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని ఓ పాఠశాలలో 229 మంది విద్యార్థులతో పాటు నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో స్కూల్ పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ విద్యార్థులలో చాలా వరకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, యవత్మల్ జిల్లాలకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఈ రెండు జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా సోకినా విద్యార్థులను సపరేట్ గా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
నాలుగు నెలల తరువాత మహారాష్ట్రలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా విదర్భ కేంద్రంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, నాగపూర్ నుంచి అమరావతి, జౌరంగాబాద్ వరకూ వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని కరోనాపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా ఉన్న డాక్టర్ సుభాష్ సాలుంకే స్పష్టం చేశారు. ఇది రెండో దఫా విజృంభణ అని చెప్పడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. దీన్ని ఇక్కడే నియంత్రించకుంటే దేశ వ్యాప్తంగా విస్తరించే ముప్పు ఖచ్చితంగా ఉందని హెచ్చరించారు.
వైరస్ విజృంభణకు భిన్న అంశాలు కారణమవుతున్నాయని మహారాష్ట్ర వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌లో కలిగే మార్పులు, వైరస్ వ్యాప్తికి కారణమవుతోన్న వ్యక్తులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. వీటి కారణంగానే వైరస్ తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని.. ఇందులో భాగంగా మొన్నటి వరకు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రస్తుతం మరోసారి పెరుగుతున్నట్లు తెలిపారు.