ప్రజల దగ్గర ఇంకా ఎన్ని 2000 రూపాయలు ఉన్నాయో తెలుసా?
2000 రూపాయల బ్యాంకు నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు
By Medi Samrat Published on 1 March 2024 2:10 PM GMT2000 రూపాయల బ్యాంకు నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. ఇంకా రూ. 8,470 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని వివరించింది. మే 19, 2023న, RBI రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చేసే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉండగా.. ఫిబ్రవరి 29, 2024 నాటికి రూ.8,470 కోట్లకు చేరిందని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే ఈ నోట్లకు సంబంధించి చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తరువాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 19 RBI కార్యాలయాల్లో ప్రజలు రూ. 2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయాలని గతంలో ఆర్బీఐ తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురంలో 19 ఆర్‌బిఐ కార్యాలయాలు బ్యాంకు నోట్లను డిపాజిట్/మార్పిడి చేయించుకున్నాయి. రూ.2000 బ్యాంకు నోట్లను నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికి చెలామణీలో ఉన్న రూ.1000, రూ.500 బ్యాంకు నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది.
Next Story