పూంచ్‌లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.
By Knakam Karthik
పూంచ్‌లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుధవారం తెల్లవారుజామున పూంచ్‌లోని దేఘ్వర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఎల్‌ఓసీకి దగ్గరగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించబడిన తర్వాత, ప్రస్తుతం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.
కాగా, సోమవారం ఉదయం దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు.