మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం విధులు నిర్వర్తిస్తున్న అనేక మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా 48 గంటల్లోనే ఇద్దరు ముంబై పోలీసు అధికారులు కోవిడ్-19 సోకి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ముంబై నగరంలో 114 మంది పోలీసు అధికారులకు కోవిడ్ -19 కు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 523 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. ఈ కేసులలో ముంబైలో వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన మొత్తం 18 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ఇందులో ఒక జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, నలుగురు అదనపు పోలీస్ కమీషనర్లు, 13 డిప్యూటీ పోలీస్ కమిషనర్లు ఉన్నారు.
ఈ 18 మంది ఐపీఎస్ అధికారులపై ఉన్న చార్జీలను తాత్కాలికంగా ఇతర అధికారులకు అదనపు చార్జీలుగా ఇచ్చారు. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన పోలీసుల సంఖ్య 125కి చేరింది. ఆదివారం ముంబైలో 24 గంటల్లో 19,474 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాటి 20,318 కంటే స్వల్పంగా తక్కువ. నగరంలో అదే 24 గంటల వ్యవధిలో ఏడు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. 19,474 కొత్త కేసులలో, 82 శాతం (15,969) మందికి లక్షణాలు లేవు. నగరంలో ప్రస్తుతం 1,11,437 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబైలోని 20 శాతానికి పైగా హాస్పిటల్ బెడ్‌లు ఇప్పుడు ఆక్రమించబడ్డాయి. ఆదివారం ఉదయం.. ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించారు. కోవిడ్-సముచిత ప్రవర్తనను అనుసరించాలని సందర్శకులను అభ్యర్థించారు.