భారత్‌కు బిగ్ రిలీఫ్.. ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు!

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్‌కు చెందిన రెండు ఎల్‌పిజి (LPG) ట్యాంకర్లు సిద్ధమవుతున్నాయి.

By -  అంజి
Published on : 21 March 2026 9:26 AM IST

Strait of Hormuz, Indian LPG Tankers, Pine Gas, Jag Vasant, Energy Crisis, Iran Conflict, Oil Shipments, Narendra Modi, BPCL, IOC, Global Trade Disruption

భారత్‌కు బిగ్ రిలీఫ్.. ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు!

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్‌కు చెందిన రెండు ఎల్‌పిజి (LPG) ట్యాంకర్లు సిద్ధమవుతున్నాయి. గత 24 గంటలుగా ఈ మార్గంలో ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినప్పటికీ, భారతీయ నౌకలు 'పైన్ గ్యాస్', 'జగ్ వసంత' తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో, భారత నౌకల కదలికలు కీలకంగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమపై ఆంక్షలు విధిస్తే గల్ఫ్ నుండి వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ఇంధన మార్కెట్ ఆందోళనలో ఉంది. మార్చి 18న ఒక ఖాళీ చమురు ట్యాంకర్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు చెందిన 22 నౌకలు ఉన్నాయి. వీటి సురక్షిత ప్రయాణం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. భారత నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని, సురక్షిత మార్గం ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో ప్రపంచ దేశాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

గత వారంలో ఇరాన్ రెండు భారతీయ ఎల్‌పిజి నౌకలను అనుమతించడం గమనార్హం. అంటే, కొన్ని రవాణా నౌకల విషయంలో ఇరాన్ సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూఏఈలోని షార్జా సమీపంలో ఉన్న 'జగ్ వసంత' (BPCL ద్వారా చార్టర్ చేయబడింది), 'పైన్ గ్యాస్' (IOC ద్వారా నిర్వహించబడుతోంది) శనివారం తమ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నౌకల కదలికలు విజయవంతమైతే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

Next Story